అనుమానంతో భార్యను కొట్టి చంపి.. జబ్బుతో అని డ్రామా!

అనుమానంతో భార్యను కొట్టి చంపి.. జబ్బుతో అని డ్రామా!

బెంగళూరు: కట్టుకున్న భార్యపై అనుమానంతో దారుణంగా కొట్టి.. ఆమె చావుకు కారణమైన భర్త, ఫిట్స్ వల్ల ఇలా జరిగిందని నమ్మించబోయి అడ్డంగా దొరికిపోయాడు. పోస్టుమార్టంలో అసలు విషయం తేలడంతో ఆదివారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని బీటీఎం లేఔట్‌లో ఈ ఘటన జరిగింది. బెంగళూరులో జాబ్ చేస్తున్న అజిత్ అనే 25 ఏండ్ల యువకుడు రెండేళ్ల క్రితం సానియా (20) అనే యువతిని పెండ్లి చేసుకున్నాడు. అయితే ఆమె కొద్ది రోజులుగా వేరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని అజిత్‌కు అనుమానం వచ్చింది. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే జూన్ 28న రాత్రి కలిసి ఇంట్లో ఆల్కహాల్ తాగుతూ కొట్లాడుకున్నారు. ఆ సమయంలో కోపం పట్టలేక అజిత్ ప్లైవుడ్‌తో సానియాను తల, వీపు, కాళ్లపై దారుణంగా కొట్టాడు. ఒక్క రోజంతా ఆమెను గాయాలతో ఆ ఇంట్లోనే వదిలేశాడు. ఆ తర్వాతి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. ఆమెకు ఫిట్స్ వచ్చి, కింద పడిపోయి ఆ తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్లకు చెప్పాడు. నాలుగు రోజులుగా ట్రీట్‌మెంట్ పొందుతున్న సానియా మరణించింది. డాక్టర్లకు సానియాకు గాయాలైన తీరు చూసి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి, సానియా మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఆమె మూర్చతో పడిపోయి కాదు.. దారుణంగాకొట్టడం వల్లనే గాయాలయ్యి, మరణించిందని తేలింది. దీంతో అతడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కస్టడీలో తన నేరాన్ని అతడు ఒప్పుకున్నాడని చెప్పారు.